“బళ్ళో రెండుసార్లు భోజనం పెడితే బాగుండు.”
ఏడేళ్ళ బసవరాజు తెలంగాణలోని శేరిలింగంపల్ల్కి మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నాడు. ఈ బడి రంగారెడ్డి జిల్లాలో ఉంది. దేశవ్యాప్తంగా బడి పిల్లలకు మధ్యాహ్నభోజనంగా వేడివేడి భోజనాన్ని అందించే 11.2 లక్షల పాఠశాలల్లో ఇదీ ఒకటి. బసవరాజు చదివే బడిలోనే చదువుతున్న పదేళ్ళ అంబిక - బడికి వచ్చేముందు కేవలం ఒక గ్లాసు గంజి తాగి వస్తుంది - వంటి పిల్లలకు కూడా బడిలో పెట్టే ఈ భోజనమే ఆ రోజుకు మొదటి భోజనమవుతుంది.
భారతదేశ మధ్యాహ్న భోజన పథకం ప్రభుత్వ, ప్రభుత్వ-సహాయక పాఠశాలలు, సర్వశిక్షా అభియాన్ మద్దతు ద్వారా నడిచే ప్రభుత్వ-అభ్యాస కేంద్రాలలో 1 నుండి 8వ తరగతి వరకు చదువుతున్న సుమారు 118 మిలియన్ల మంది విద్యార్థులకు- పని దినాలలో ఆహారాన్ని అందజేస్తుంది. ఇందుకు ఎటువంటి డబ్బు చెల్లించనవసరం లేదు. నిండుగా ఉన్న పొట్ట గణిత శాస్త్రపు లెక్కలు చేయడాన్ని సులభతరం చేస్తుందని, అక్షరగుణితంతో కుస్తీ పట్టనవసరం లేదనే విషయాన్నిఎవరూ కాదని వాదించలేరు. అయితే ఈ మధ్యాహ్న భోజనం ప్రాథమికంగా పిల్లలను పాఠశాలకు తీసుకురావాలనే భావనతో మొదలయింది. (కనీసం 150 మిలియన్ల మంది పిల్లలు , యువత భారతదేశంలో అధికారిక విద్యా వ్యవస్థకు దూరంగా ఉన్నారని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు.)
రాజస్థాన్ రాష్టం, భీల్వారా జిల్లాలోని జోధ్గఢ్ గ్రామంలో ఉన్న రాజకీయ ప్రాథమిక్ విద్యాలయలో పదేళ్ళ వయసున్న దక్ష్ భట్‌ను మేం కలిశాం. ఇంటినుంచి బడికి వచ్చేముందు అతను ఆహారంగా తీసుకున్నది కాసిని బిస్కెట్లు మాత్రమే. అక్కడికి వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న అసోం రాష్ట్రం, నల్బారీ జిల్లాకు చెందిన అలీశా బేగమ్ తాను బడికి - నం. 858 నిజ్-ఖ-ఆగతా ఎల్పి స్కూల్ - వచ్చేముందు ఒక రోటీ తిని, పాలు కలపని టీ తాగివచ్చానని మాతో చెప్పింది. ఆమె తండ్రి ఒక వీధి వ్యాపారి, తల్లి గృహిణి.



బసవరాజు (ఎడమ) , అంబిక (మధ్యలో)లు తమ బడిలో మధ్యాహ్న భోజనాన్ని చాలా ఆస్వాదిస్తారు , ప్రత్యేకించి భోజనంలో గుడ్లు ఇచ్చినపుడు. ఆ రోజులో తన మొదటి భోజనాన్ని తింటోన్న దక్ష్ భట్ (కుడి) ; పొద్దున్నే బడికి వచ్చేముందు అతను తిన్నది కేవలం కాసిని బిస్కట్లు మాత్రమే
పాఠశాలలో ఇచ్చే భోజనం - పౌష్టికాహారం అందుబాటులో ఉండని పేద, అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లలకు చాలా అవసరం.ఈ భోజనంలో ప్రాథమిక పాఠశాల (1-5 తరగతులు) కోసం 480 కేలరీలు, 12 గ్రాముల ప్రోటీన్; అప్పర్ ప్రైమరీకి (6-8 తరగతి) 720 కేలరీలు, 20 గ్రాముల ప్రోటీన్ ఉంటాయి.
బెంగళూరు నగరంలోని పట్టనగెరె ప్రాంతంలో ఉన్న నమ్మూర ప్రభుత్వ దిగువ ప్రాథమిక పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్. సుగుణ, “ఒకరిద్దరు పిల్లలు మినహా అందరూ పాఠశాలలో ఉచిత భోజనం తింటారు” అని గమనించారు. ఈ పిల్లలంతా ఉత్తర కర్ణాటకలోని యాద్గిర్ (యాద్గిరి అని కూడా పిలుస్తారు) జిల్లాకు చెందిన వలస కూలీల పిల్లలు. ఈ కూలీలు బెంగళూరు నగరంలో నిర్మాణ స్థలాల్లో పనిచేస్తున్నారు.
'ప్రధాన్ మంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్' లేదా ' పీఎం పోషణ్ 'గా 2021లో పేరు మార్చిన యీ మధ్యాహ్న భోజన పథకం, "పిల్లలు మరింత ఎక్కువగా బడిలో చేరడాన్ని ప్రోత్సహించి, బడి మానేయడాన్ని నిలుపుదల చేసి, హాజరును మెరుగుపరచడం; అదే సమయంలో పోషకాహార స్థాయిలను మెరుగుపరచడం"లను లక్ష్యంగా పెట్టుకుంది. 1995 నుండి కేంద్ర ప్రాయోజిత జాతీయ కార్యక్రమంగా ఉన్న ఈ పథకం, భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ, కేంద్రపాలిత ప్రాంతంలోనూ అమలులో ఉంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, రాయ్‌పూర్ జిల్లాలోని మటియా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పూనమ్ జాదవ్ మధ్యాహ్న భోజనం చేస్తున్న 80 మందికి పైగా విద్యార్థులను నవ్వుతూ చూస్తున్నారు. "కొద్దిమంది తల్లిదండ్రులు మాత్రమే తమ పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని అందించగలరు," అని ఆమె అభిప్రాయపడ్డారు. "ఈ మధ్యాహ్న భోజనంలోని అందం ఏమిటంటే, పిల్లలంతా కలిసి కూర్చుని తినడం. దీన్ని పిల్లలు చాలా ఆనందిస్తారు."
ఈ భోజనం మౌలికంగా ఆహార ధాన్యాలు, పప్పులు, కూరగాయలతో తయారవుతుంది. నూనె లేదా కొవ్వు, ఉప్పు, మసాలాలతో కలిపి వండుతారు. అయితే అనేక రాష్ట్రాలు కొన్ని అనుబంధ పోషక పదార్థాలతో సహా తమ స్వంత రుచులను మెనూలో చేర్చుకున్నాయని విద్యా మంత్రిత్వ శాఖ 2015లో వెలువరించిన ఒక నివేదిక పేర్కొంది. ఝార్ఖండ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు గుడ్లు, అరటిపండ్లను జోడించగా, కర్ణాటక ఒక గ్లాసు పాలు (ఈ సంవత్సరం నుండి గుడ్లుకూడా) ఇస్తోంది. చత్తీస్‌గఢ్, అసోం, అరుణాచల్ ప్రదేశ్లు భోజనంలో చేర్చగలిగే కూరగాయలను పండించడానికి పెరటి తోటలను ప్రోత్సహిస్తున్నాయి. గోవాలో మహిళా స్వయంసహాయక బృందాలు ఆహారాన్ని సరఫరా చేస్తున్నాయి. మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు తల్లిదండ్రుల నుంచి సహకారాన్ని ప్రోత్సహిస్తున్నాయి. గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో స్థానిక ప్రజలు ఈ భోజనంలో చేర్చడానికి బలవర్ధకమైన పదార్థాలను స్వచ్ఛందంగా సరఫరా చేస్తున్నారు.


ఎడమ: ఛత్తీస్‌గఢ్‌లోని ఫూట్‌హాముడా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కమార్ సముదాయానికి చెందిన పిల్లలు. కుడి: అన్నం , పప్పు , కూరగాయలతో కూడిన వారి మధ్యాహ్న భోజనం


ఎడమ: ఫూట్హాముడాలోని ప్రభుత్వ పాఠశాలలో 3 వ తరగతి చదువుతోన్న కీర్తి (ముందుభాగంలో ఉన్న పాప). కుడి: ఈ బడిలోని పెరటి తోట నుంచే కూరగాయలు వస్తాయి
ఛత్తీస్‌గఢ్‌లోని ఫూట్‌హాముడా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో, మొత్తం 10 మంది విద్యార్థులు రాష్ట్రంలో పివిటిజి (విశేషించి దుర్బల ఆదివాసీ సమూహం)గా జాబితా చేయబడిన కమార్ సముదాయానికి చెందినవారు. “కమార్లు ప్రతిరోజూ అడవికి వెళ్ళి అటవీ ఉత్పత్తులను, ఇంధనం కోసం కలపను సేకరిస్తారు. వారి పిల్లలకు బడిలో తిండి ఉంటుందని, అలాగే చదువుకుంటారని కూడా వారికి భరోసా ఇస్తున్నాం,” అని ధమ్తరి జిల్లాలోని నగరీ బ్లాక్‌లో ఉన్న ఈ చిన్న పాఠశాలకు బాధ్యత వహించే ఏకైక ఉపాధ్యాయురాలు రుబీనా అలీ చెప్పారు.
తమిళనాడులోని సత్యమంగళం అటవీ ప్రాంతం, ఈరోడ్ జిల్లాలోని గోబిచెట్టిపాళయం తాలూకా, తలైమలై గ్రామంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆదివాసీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఎక్కువగా సొలెగా, ఇరుళ (షెడ్యూల్డ్ తెగలు) తెగలకు చెందిన 160 మంది పిల్లలున్నారు. వీరికి మామూలు అన్నం-సాంబారుతో పాటు వారానికి కొన్నిసార్లు గుడ్డు కూర కూడా లభిస్తోంది.
2021-22 నుండి 2025-26 వరకు పిఎమ్-పోషణ్ కోసం అయ్యే మొత్తం ఖర్చు రూ. 130,794 కోట్లను కేంద్రం, రాష్ట్రాలు భరిస్తున్నాయి. నిధుల పంపిణీ, ఆరు లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఆహార ధాన్యాల బదిలీకి కొన్నిసార్లు అవాంతరాలు వస్తాయి. దాంతో ఉపాధ్యాయులు, వంటవారు మార్కెట్ నుండి ఆహార ధాన్యాలను కొనుగోలు చేస్తుంటారు. హర్యానాలోని ఇగ్రహ్ గ్రామంలో, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే షహీద్ హవల్దార్ రాజ్‌కుమార్ ఆర్‌విఎమ్ విద్యాలయలోని ఒక ఉపాధ్యాయుడు PARIతో మాట్లాడుతూ- ఇలా జరిగినప్పుడు, "పిల్లలు ఆకలితో ఉండకుండా మేం ఉపాధ్యాయులమే సహకరిస్తాం," అన్నారు. హర్యానాలోని జీంద్ జిల్లాలోని ఈ పాఠశాలలో కట్టెలు కొట్టేవారు, రోజువారీ కూలీపని చేసే కార్మికులు, ఇటుక బట్టీ కార్మికులు వంటి శ్రమించే వర్గాల పిల్లలు చదువుకుంటున్నారు, వీరికి మధ్యాహ్న భోజనంలో పులావ్, పప్పు అన్నం, రాజ్మా అన్నం లభిస్తాయి.
భారతదేశంలోని నిరుపేద పిల్లలకు ఆహారం అందించే ప్రయత్నం ఏదో ఒక్క క్షణంలో వచ్చింది కాదు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-21 ( NFHS - 5 ) ప్రకారం, ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలలో 32 శాతం మంది ఉండవలసినదానికన్నా తక్కువ బరువుతో ఉన్నారు. దేశంలో ఐదేళ్లలోపు చిన్నారుల్లో 69 శాతం మరణాలకు పోషకాహార లోపం కారణమని 2019 UNICEFనివేదిక పేర్కొంది.


దీపావళి సెలవుల్లో కూడా , అందుల్ పోతా గ్రామం (ఎడమ) నుండి పిల్లలు తమ మధ్యాహ్న భోజనంకోసం ఉత్తర 24 పరగణాల జిల్లా , బసిర్హాట్ II బ్లాక్‌లోని ధోపాబారియా శిశు శిక్ఖా (శిక్షణ) కేంద్రానికి వచ్చారు. ఖిచురీ ( కిచిడి ) లో తన వాటా కోసం వచ్చిన రోనీ సింఘా (కుడి)
సెలవు రోజున కూడా, ఎనిమిదేళ్ల రోనీ సింఘా తన తల్లితో కలిసి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, అందుల్ పోతా గ్రామంలోని ధోపాబారియా శిశు శిక్ఖా (శిక్షణా) కేంద్రానికి తన వాటా ఖిచిరీ (కిచిడీ) కోసం ఎందుకు వస్తాడో వివరించే భయంకరమైన వాస్తవం ఒకటి ఉంది. స్థానికులు ఈ పాఠశాలను ' ఖిచిరీ పాఠశాల' అని పిలుస్తారు. ఈ బడికి దాదాపు 70 మంది పిల్లలు హాజరవుతారు. అక్టోబర్ నెల చివరలో PARI పశ్చిమ బెంగాల్, ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ఈ బడిని సందర్శించినప్పుడు, దీపావళి సెలవుల సందర్భంగా పాఠశాల మూసివుంది- కానీ పిల్లలు మాత్రం తమ మధ్యాహ్న భోజనాన్ని తినడానికో లేదా, తీసుకుపోవడానికో వస్తూనే ఉన్నారు.
చాలామంది పిల్లలు ఎటువంటి సౌకర్యాలు లేని నేపథ్యాలకు చెందినవారు. వారి తల్లిదండ్రులు స్థానిక మత్స్య పరిశ్రమలో పనిచేస్తున్నారు. "ఈ పాఠశాల వారు వండిన ఆహారాన్ని క్రమం తప్పకుండా సరఫరా చేయడం ద్వారా కోవిడ్ -19 తీవ్రంగా ఉన్న సమయంలో కూడా గొప్ప సహాయంగా ఉన్నారు" అని రోనీ తల్లి (ఆమె తన పేరు చెప్పడానికి ఇష్టపడలేదు) అన్నారు.
మార్చి 2020లో కోవిడ్-19 సంభవించినప్పుడు, అనేక రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుకు అంతరాయం కలిగింది. పాఠశాలలను మూసివేయడం లక్షలాదిమంది పిల్లలను ప్రభావితం చేసింది. కర్ణాటకలో, మధ్యాహ్న భోజనం విద్యను అందించాలనే ప్రాథమిక హక్కుతో నేరుగా ముడిపడి ఉందని ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది
ఐశ్వర్య తెలంగాణలోని గచ్చిబౌలి సమీపంలో తక్కువ-ఆదాయవర్గాలు జీవించే ప్రాంతమైన పి. జనార్దన్ రెడ్డి నగర్‌లోని ప్రాథమిక పాఠశాల విద్యార్థిని. ఆమె తండ్రి రంగారెడ్డి జిల్లాలో నిర్మాణ స్థలాల్లో దినసరి కూలీగా పనిచేస్తుండగా, తల్లి ఇళ్ళల్లో పనులు చేస్తుంటారు. ఆకలితో ఉన్న ఈ తొమ్మిదేళ్ల పాప ఇలా అంటోంది: “బడిలో ప్రతిరోజూ గుడ్లు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు రోజూ మాకు ఒకటి కంటే ఎక్కువ గుడ్లు ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను."
పెద్ద సంఖ్యలో పిల్లలకు ఆహారం అందించడంలో ప్రధాన పాత్ర ఉన్నప్పటికీ, మధ్యాహ్న భోజన పథకం అవినీతి, కల్తీ, నాణ్యతా లోపం, వైవిధ్యం లేని ఆహారం, కులవివక్ష వంటివాటితో పీడించబడుతోంది. గత సంవత్సరం గుజరాత్, ఉత్తరాఖండ్‌లలో దళితులైన వంటవారు చేసిన ఆహారాన్ని అగ్రవర్ణాల విద్యార్థులు బహిష్కరించారు. మరో సందర్భంలో దళిత వంట మనిషిని తొలగించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.


ఎడమ: తెలంగాణలోని శేరిలింగంపల్లి మండలంలో ఉన్న తాను చదివే ప్రాథమిక పాఠశాలవారు తరచుగా గుడ్లు వడ్డించాలని కోరుకుంటోన్న ఐశ్వర్య. కుడి: తమిళనాడులోని సత్యమంగళం అటవీ ప్రాంతం , తలైమలిలోని ఆదివాసీ రెసిడెన్షియల్ పాఠశాలలో పిల్లలకు మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్నారు
కర్ణాటకలో, 2015-16, 2019-20ల మధ్య ఐదేళ్లలోపు పిల్లలలో వయసుకు తగ్గ పెరుగుదల లేని పిల్లల సంఖ్య కేవలం ఒక శాతం మాత్రమే - 36 నుండి 35 శాతానికి - తగ్గింది ( NFHS - 5 ). కొడగు, మైసూర్ జిల్లాల్లోని పిల్లలలో పోషకాహార లోపాలపై దృష్టి పెట్టాలని 2020లోని ఒక ప్రభుత్వ నివేదిక పిలుపునిచ్చింది. అయితే మధ్యాహ్న భోజనంలో ఇచ్చే గుడ్లు శాకాహారమా కాదా అనే దానిపైనే రాజకీయ పార్టీలు మల్లగుల్లాలు పడుతూనేవున్నాయి.
దేశంలోని పోషకాహార సంక్షోభాన్ని దృష్టిలోకి తీసుకున్నప్పుడు, 6.16 లక్షలమంది పోషకాహార లోపం ఉన్న పిల్లలు - భారతదేశంలోని పోషకాహార లోపం ఉన్న పిల్లలలో ఐదవ వంతు కంటే కొద్దిగా తక్కువ - ఉన్న మహారాష్ట్రలో పాఠశాలలను ఎందుకు మూసివేస్తున్నారనేది ఆశ్చర్యం కలిగిస్తుంది. అహ్మద్‌నగర్ జిల్లాలోని గుండేగాఁవ్ గ్రామంలోని అలాంటి ఒక పాఠశాలలో ఎక్కువమంది విద్యార్థులు పార్ధీలు. ఒక విముక్త (డీనోటిఫైడ్) జనజాతి అయిన పార్ధి సముదాయం రాష్ట్రంలో అత్యంత పేద, అత్యంత వెనుకబడిన తెగ.
“పాఠశాల మూతపడిన తర్వాత, ఈ పిల్లలు బడికి రావడం (చదువు) మానేయడమే కాకుండా పోషకాలతో నిండివుండే భోజనాన్ని కూడా కోల్పోతారు. ఇది ఆదివాసీ, వెనుకబడిన వర్గాల పిల్లలలో పోషకాహార లోపాన్ని మరింత పెంచడంతో పాటు బడి మానేసే పిల్లల సంఖ్యను కూడా పెంచుతుంది" అని పావుట్కావస్తి గుండెగాఁవ్ ప్రాథమిక జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కుసాళ్కర్ జ్ఞానదేవ్ గంగారామ్ చెప్పారు.
మంజూర్ భోసలే ఎనిమిదేళ్ల కుమార్తె భక్తి కూడా ఇక్కడ చదువుతోన్న 15 మంది పార్ధి విద్యార్థులలో ఉంది. “బడి లేదు, ఆహారం లేదు. మూడు సంవత్సరాల కరోనా చాలా చెడ్డది,” అన్నారు మంజూర్. "మరోసారి పాఠశాలలు మూసేస్తే, మా పిల్లలు ఎలా ముందుకు వెళ్ళగలరు?"


మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా, పావుట్కావస్తి
గుండెగాఁవ్ ప్రాథమిక జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థిని భక్తి భోసలే (ఎడమ). ఈ పాఠశాలను
మూసివేయడం వలన భక్తి, ఆమెవంటి విద్యార్థులు బడిలో పెట్టే మధ్యాహ్న భోజనాన్ని కోల్పోతారు

'
బడిని
మూసేసిన తర్వాత
,
ఈ పిల్లలు చదువు మానేయడమే కాకుండా పోషకాలతో నిండిన భోజనాన్ని
కూడా నష్టపోతార
'
ని ఇక్కడ తన విద్యార్థులతో కలిసి కనిపిస్తోన్న గుండేగాఁవ్ లోని
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కుసాళ్కర్ జ్ఞానదేవ్ గంగారామ్ అంటారు

హర్యానాలోని
జింద్ జిల్లాలో
,
పాఠశాల మధ్యాహ్న భోజనం కోసం రావాల్సిన నిధులు ఆలస్యం అయినప్పుడు
,
పిల్లలు
ఆకలితో ఉండకుండా ఉండేదుకు ఇగ్రహ్ గ్రామంలోని షహీద్ హవల్దార్ రాజ్‌కుమార్ ఆర్‌విఎమ్
విద్యాలయంలోని ఉపాధ్యాయులు భోజనానికి అయ్యే ఖర్చులను తామే భరిస్తారు

తన బడి భోజనాన్ని చూపిస్తోన్న ఇగ్రహ్ గ్రామంలోని షహీద్ హవల్దార్ రాజ్‌కుమార్ ఆర్‌విఎమ్ విద్యాలయ విద్యార్థిని శివాని నఫ్రియా

కలిసి
మధ్యాహ్న భోజనం చేస్తోన్న షహీద్ హవల్దార్ రాజ్‌కుమార్ ఆర్‌విఎమ్ విద్యాలయ విద్యార్థులు

ఛత్తీస్‌గఢ్
రాష్ట్రం
,
మటియా గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అప్పుడే తమ
మధ్యాహ్న భోజనాన్ని ముగించిన యశ్
,
కునాల్
,
జగేశ్

తమ
భోజనాన్ని ముగించి తరగతి గదులలోకి వెళ్తోన్న రాయపూర్ జిల్లా
,
మటియా
గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు

మటియా
పాఠశాల మధ్యాహ్న భోజనంలో అన్నం
,
పప్పు
,
కూరగాయలు ఉంటాయి

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం , మటియాలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ముగించి తమ పళ్ళేలను శుభ్రం చేస్తున్న పఖి (కెమెరావైపు చూస్తున్న పాప) , ఆమె స్నేహితులు

ఛత్తీస్‌గఢ్
,
ధమ్తరీ
జిల్లా ఫూట్‌హాముడా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద తమ మధ్యాహ్న భోజనం కోసం
ఎదురుచూస్తోన్న పిల్లలు

ఫూట్‌హాముడా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వడ్డన

ఫూట్‌హాముడా
పాఠశాలలో భోజనం చేస్తోన్న పిల్లలు


తెలంగాణాలోని
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండల పరిషద్ ప్రాథమిక పాఠశాల (ఎడమ)లోనూ
,
హర్యానాలోని
జీంద్ జిల్లా రాజకీయ ప్రాథమిక్ విద్యాలయ (కుడి)లోనూ ఒక గోడమీద రంగులతో రాసివున్న మధ్యహ్న
భోజన వివరాలు

శేరిలింగంపల్లి
మండల పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారుచేసే వంటగది

సంజన
ఎస్. బెంగళూరులోని నమ్మూర ప్రభుత్వ దిగువ ప్రాథమిక పాఠశాలలో చదువుతోంది. మధ్యాహ్న భోజనంగా
ఇచ్చే బిసి బెళె బాత్ అంటే ఆమెకెంత ఇష్టమంటే
,
దాన్ని ఆమె రెండుసార్లు వడ్డించుకుంటుంది

ఐశ్వర్య
చెంగప్ప
,
ఆలిజా ఎస్.లు బెంగళూరులోని పట్టణగెరె ప్రాంతంలో ఉన్న నమ్మూర
ప్రభుత్వ దిగువ ప్రాథమిక పాఠశాలలో ఒకే తరగతి చదువుతున్నారు
,
ఇరుగుపొరుగువారు
కూడా. బడిలో ఇచ్చే మధ్యాహ్న భోజనాన్ని వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసే తింటారు

ఎడమ నుంచి కుడికి: మధ్యాహ్న భోజనం చేస్తున్న అనీషా , రూబీ , ఆయేషా , షహనాజ్. వీరు అసోం రాష్ట్రం , నల్బారీ జిల్లాలోని నం. 858 నిజ్-ఖ-ఆగతా ఎల్పి పాఠశాలకు చెందినవారు

రాజస్థాన్‌లోని భీల్వారా జిల్లా కరేడా బ్లాక్‌లోని జోధ్గఢ్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కలిసి భోజనం చేస్తున్న విద్యార్థులు

ఈరోడ్ జిల్లా తలైమలైలో ఆదివాసీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఉన్న 160 మంది విద్యార్థులలో ఎక్కువమంది సొలెగ , ఇరుళ సముదాయాలకు చెందినవారు
ఈ కథనాన్ని ఛత్తీస్‌గఢ్ నుంచి పురుషోత్తం ఠాకూర్; కర్ణాటక నుంచి సంథలిర్ ఎస్.; తెలంగాణ నుంచి అమృత కోసూరు; తమిళనాడు నుంచి ఎమ్. పళని కుమార్; హర్యానా నుంచి ఆమిర్ మాలిక్; అసోం నుంచి పింకు కుమార్ దాస్; పశ్చిమ బెంగాల్ నుంచి ఋతాయన్ ముఖర్జీ; మహారాష్ట్ర నుంచి జ్యోతి శినోలి; రాజస్థాన్ నుండి హాజీ మహమ్మద్ నివేదించారు. సన్వితి అయ్యర్ సంపాదకీయ మద్దతుతో ప్రీతి డేవిడ్, వినుత మాల్యాలు సంపాదకత్వం వహించారు. బినాయ్ఫర్ భరూచా ఫోటో ఎడిటింగ్ చేశారు.
కవర్ ఫోటో: ఎమ్ పళని కుమార్
అనువాదం: సుధామయి సత్తెనపల్లి