ఢాక్ ల శబ్దాలతో అగర్తలా అంతా కంపిస్తోంది. అక్టోబర్ 11న దుర్గ పూజ జరుగుతోంది. ప్రతీ ఏడాది, ఈ పండుగ సన్నాహాలు కొన్ని వారాల ముందు నుంచే మొదలవుతాయి. పండగకు పండాళ్లు నిర్మిస్తారు, విగ్రహాలను తయారుచేసేవారు తమ విగ్రహాలకు తుది మెరుగులు దిద్దుతారు, కుటుంబంలో అందరూ కొత్త బట్టలు కొనుకుంటారు.
ఢాక్ అనే డ్రమ్ వంటి ఆకారం ఉన్న వాయిద్యాన్ని మెడకు తగిలించుకుని, గట్టిగా చదునుగా ఉండే స్థలం పై పెట్టి, కర్రలతో దీనిని మోగిస్తారు. పండగల్లో ఇది ఒక ముఖ్యమైన భాగం.
కానీ కాలాన్ని బట్టే ఢాక్ ని వాయించడం జరుగుతుంది. పూజ సమయమైన ఆ ఐదు రోజులూ మోగించి, చివరి రోజైన లక్ష్మి పూజకు దరువు పెంచుతారు . ఈ ఏడాది ఈ పూజ అక్టోబర్ 20న వచ్చింది. కొంతమంది ఢాకీ లకు అగర్తలాలోనేకాక త్రిపురలోని ఇంకా చాలా భాగాలలో విపరీతమైన డిమాండ్ ఉంది.
ఢాకీ లను పండాల్ కమిటీలేగాక కుటుంబాలు కూడా పీలుస్తాయి. కొన్నిసార్లు వారికి పని ఇవ్వబోయే ముందు ఒకసారి వాయించి చూపమంటారు. ఇందులో దాదాపుగా అందరు ప్రవీణులే. వీరి ఇంట్లో పెద్దవారు వీరికి ఈ వాయిద్యాన్ని చిన్నప్పటి నుంచే వాయించడం నేర్పుతారు. “నేను నాకన్నా పెద్దవారైన మా తల్లిదండ్రుల తోబుట్టువుల పిల్లలతో కలిసి వాయించేవాణ్ణి.” అన్నాడు 45 ఏళ్ళ ఇంద్రజిత్ రిషిదాస్. “నేను కషి (ఒక లోహపు వాయిద్యం, చిన్న కర్రతో వాయిస్తారు) తో మొదలుపెట్టాను, ఆ తరవాత ఢోల్ , ఇక ఆ తరవాత ఢాక్ .” ఇతను, ఇతనితో పాటు ఇంకో రిషిదాస్, రోహిదాస్, రవిదాస్ కుటుంబాలు ముంచి వర్గానికి చెందినవారు. త్రిపురలో వీరిని షెడ్యూల్ కుల జాబితాలో చేర్చారు.)
తనవంటి ఎందరో అగర్తలా ఢాకీ లలా, ఇంద్రజిత్ మిగిలిన సంవత్సరమంతా సైకిల్ రిక్షా నడుపుతాడు. కొన్నిసార్లు, మిగిలినవారిలా అతను బాండులలో వాయిస్తాడు. స్థానికంగా వీరిని ‘బ్యాండ్-పార్టీ’, అని పిలుస్తారు. ఇటువంటి సందర్భాలు లేనప్పుడు ఢాకీ లు ఎలెక్ట్రిషియన్లుగా, ప్లంబర్లుగా రోజువారీ కూలీ పని చేస్తున్నారు. కొందరు కూరగాయలు అమ్మేవారు, కొందరు దగ్గరి గ్రామాలలో ఉన్న రైతులు ఏవైనా ప్రోగ్రాములు మాట్లాడుకున్నప్పుడు వస్తారు.

అగర్తలా భక్తి అబోయినగర్ ప్రాంతంలో ఇంద్రజిత్ పని కోసం ఇంటి నుంచి వచ్చాడు. పూజ వేడుకలు ఆరంభమయ్యేలోపు, ధాకీలు రిక్షాలు నడుపుతారు
ఒక సైకిల్ రిక్షా నడిపేవాడిగా ఇంద్రజిత్ కు రోజుకు 500 రూపాయిలు వస్తాయి. “సంపాదించడానికి మేము ఏదో ఒక మార్గం వెతుక్కోవాలి. రిక్షా అన్నిటికన్నా తేలికైనదిగా అనిపించింది.” అన్నాడు. “ఇంకా మంచి పని దొరుకుతుందనుకుని ఎదురుచూడడంలో అర్థం లేదు. దుర్గ పూజా సమయం లో, రిక్షా లాగి ఒక నెలలో సంపాదించేది ఒక వారంలో ఢాకీ గా మారి సంపాదించవచ్చు. ఈ ఏడాది 2021 లో ఒక పండాల్ కమిటీ వద్ద అతను 15,000 రూపాయలకు సరిపడా పనిని సంపాదించుకున్నాడు. కొందరు అతనికి ఇవ్వవలసిన దాని కంటే తక్కువ ఇచ్చినా కూడా.
అన్ని పండాళ్లలోనూ ఢాకీ లను(అగర్తలాలో మగవారు మాత్రమే ఈ వాయిద్యాన్ని వాయిస్తారు) ఈ ఐదు పూజ రోజులూ పనికి తీసుకుంటారు. ఇంద్రజిత్ అన్నాడు, “పంతులు ఏ సమయానికి మేము అక్కడ ఉండాలో చెబితే ఆ సమాయానికి మేము అక్కడ ఉండాలి. మేము పొద్దున్న పూజ కు మూడు గంటలు, సాయంత్రం పూజాకి 3-4 గంటలు ఉండాలి.”
ఈ బ్యాండ్-పార్టీ పనులు ఎప్పుడో గాని రావు. “మేము మామూలుగా ఒకా ఆరుగురు బృందంగా పనిచేస్తాము - ఎక్కువగా పెళ్లిళ్లకాలంలో. ఎన్ని రోజులు పని చేస్తే అన్ని డబ్బులు వారి వద్ద నుండి తీసుకుంటాము. కొంత మంది మమ్మల్ని 1-2 రోజులకు మాత్రమే పిలిస్తే కొందరు 5-6 రోజులు కోసం కూడా పిలుస్తారు,” అన్నాడు ఇంద్రజిత్. అలా పిలుస్తే మొత్తం బృందానికి 5,000 నుంచి 6,000 రూపాయిల వరకు వస్తాయి.
పోయిన ఏడాది, కోవిడ్ మహారోగం మూలంగా, చాలా మంది పూజ చేయలేదు. దీనివలన ఢాకీ లకు వారి రిక్షా పని తోనూ, పొదుపు చేసుకున్న డబ్బుతోను బతుకును నడపవలసి వచ్చింది. అతి కొద్దిమందికి మాత్రమే చివరి నిముషంలో ఢాక్ ని వాయించే పని దొరికింది. (ఈ ఫొటోలన్నీ పోయిన ఏడాది తీసినవే)
దుర్గ పూజకు మొదలైన వారం తరవాత వచ్చే లక్ష్మి పూజ, ఢాకీల పనికి ఆఖరుకు రోజు. ఆ సాయంత్రం వారు అగర్తలా వీధుల మీదకు ఒంటరిగా లేక జంటగా వారి డోలు లన్నీ పట్టుకువస్తారు. వీధిలో నివసిస్తున్న కుటుంబాలు, ఈ శుభసమయాన వీరిని, వారి ఇంటి ముందు 5-10 నిముషాలు వాయించమని అడుగుతారు. ఇందుకు ప్రతిఫలంగా వారికి 20-50 రూపాయిల వరకు ప్రతి ఇంటి నుంచి వస్తుంది. చాలామంది ఈ పని ఆచారాన్ని కొనసాగించడం కోసం చేస్తున్నామని చెబుతారు.

దుర్గ పూజకు పది రోజుల ముందు నుంచే సన్నాహాలు మొదలవుతాయి. ఢాక్ లను తీసి, తాళ్ళని శుభ్రం చేసి, గట్టిగా లాగి బిగించి కట్టి, వాయిద్యం శబ్దం బాగా పలికేలా తయారుచేస్తారు. ఇది శారీరకంగా చాలా శ్రమ పెట్టే పని, ఎందుకంటే ఈ తాళ్లు జంతు చర్మం తో చేసి ఉంటారు, ఇవి కాలం గడిచేకొద్దీ బిగుసుకుపోతాయి. ఈ పనికి సాధారణంగా ఇద్దరు మనుషులు కావాలి. “ఈ పనికి చాలా శక్తి కావాలి. దీనికి బోల్డంత బలం కావాలి, ఒక్కరే చేయడం కష్టం,” అన్నారు ఇంద్రజిత్ రిషిదాస్. “ఇది చాలా ముఖ్యమైన పని ఎందుకంటే ఆ తరవాత వాయిద్యం ఎలా పలుకుతుంది అనేది ఇప్పుడు చేసే పని పై ఆధారపడి ఉంటుంది”

ఢాక్ లని శుభ్రపరిచి, శృతిని చూసుకున్నాక, వాటిని జాగ్రత్తగా ఒక శుభ్రమైన వస్త్రంతో చుట్టి, అటకల పైన దాస్తారు. ఇక పూజ సమయంలో మాత్రమే వీటిని బయటకు తీస్తారు

నగరం లో అందరు పూజను వేడుకగా జరుపుకుంటుంటే కల్నల్ చౌమొహని(క్రాస్ రోడ్స్) వద్ద ఇద్దరు ఢాకీలు దుర్గ విగ్రహాన్ని తీసుకురావడానికి వచ్చారు. ఈ ఢాక్ ని పూజ జరిపే సమయాల్లో - విగ్రహాన్ని తీసుకొచ్చేటప్పుడు, పండాల్ లో ప్రతిష్టించేటప్పుడు, పూజ జరుగుతున్నప్పుడు, నిమజ్జనం సమయంలో కూడా వాయిస్తారు

సెంట్రల్ అగర్తలా లో కమన్ చౌమొహని జంక్షన్ వద్ద ఒక ఢాకీ పని దొరుకుతుందేమోనని చూస్తున్నాడు. ప్రతి ఏడాది, దుర్గ పూజ సమయానికి రెండు రోజుల ముందు, చుట్టుపక్కల గ్రామాల నుండి ఢాకీలు త్రిపుర రాజధాని అగర్తలాలో, కొన్ని ప్రత్యేక స్థలాలలో రోజంతా వేచి ఉంటారు. 2020లో కోవిడ్ వలన అతి తక్కువ మందికి పని దొరికింది

బాబుల్ రవిదాస్, అగర్తలాకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం నుంచి వచ్చి, రోజంతా ఎదురుచూసి అలిసిపోయి పొగతాగుతూ, అలసట తీర్చుకుంటున్నాడు

సెంట్రల్ అగర్తలాలో బత్తుల స్టేషన్ వద్ద, ఢాకీ తన ఆటోరిక్షా ఎక్కి తన గ్రామానికి వెళ్ళిపోతున్నాడు. ఢాకీలు వేరే గ్రామాలనుండి, పట్టణాల నుండి వచ్చి దుర్గ పూజకు ముందు ఇక్కడ గుమ్మిగూడి పని దొరుకుతుందేమోనన్న ఆశతో ఎదురుచూస్తారు. ఈ బృందం రోజంతా ఎదురు చూసి ఇక 9 గం తిరిగివెళ్ళిపొదామని నిర్ణయించుకున్నారు

బిజైకుమార్ చౌముహాని ప్రాంతంలో ఖాళీ పూజ పండాల్ - మహమ్మారికి ముందు ఇలా ఎప్పుడు జరగలేదు. అయితే గత సంవత్సరం కూడా అగర్తలాలోని అన్ని పండాళ్లు అంత ఖాళీగా ఏమిలేవు

దుర్గ పూజకు ఒక వారం ముందు కృష్ణానగర్ లోని ఒక ఢాకీ, వాయిద్యాన్ని బాగుచేస్తున్నాడు

ఆచారం, సాంకేతికత కలగలిసినాయి. రామ్ నగర్ రోడ్ నెంబర్ 4లో ఢాక్ శబ్దం పెంచడానికి ఒక మైక్ ని వాడుతున్నారు. ఢాక్ అనేది బాగా శబ్దం వచ్చే వాయిద్యం, దాని ధ్వనిని పెంచడానికి ఆమ్ప్లి ఫయర్ అవసరం లేదు. దాని శబ్దం చాలా దూరం ప్రయాణించగలదు. మంటూ రిషిదాస్(అతని ఫోటో కాదు) ఢాక్ ని 40ఏళ్లుగా వాయిస్తున్నాడు. ఈ సరికొత్త సాంకేతికత వలెనే ఢాకీలకు పని దొరకకుండా పోయింది అని చెబుతున్నాడు. “ఈ రోజుల్లో ఫోనులలో ఒక బటన్ నొక్కితే ఢాక్ వినిపిస్తుంది”, అని చెప్పాడు

2020లో పని దొరికినవారందరికి చాలా ఏళ్లుగా ఒక మనిషో, క్లబ్ లేక కుటుంబంతోనో సంబంధాలున్నాయి. రామ్ నగర్ రోడ్ నెంబర్ 1 లో, వేరే సమయాల్లో రిక్షా తొక్కే కేశబ్ రిషిదాస్, ఒక స్థానిక పండాల్ లో తన ఢాక్ తో కలిసి నృత్యం చేస్తున్నాడు. అతనికి ఆ క్లబ్ మెంబెర్ తెలుసు ఆ పరిచయం ద్వారానే అతనిని పనికి పిలిచారు

కేశబ్ రిషిదాస్ ఏడాది పొడుగునా సైకిల్ రిక్షా తొక్కుతాడు. పూజా సమయాల్లో తన కొడుకుని వెంటబెట్టుకుని ఢోల్ వాయించడానికి వెళ్తాడు. కొన్ని సార్లు ఢాక్ లతో జతకలిపి తాళం వేస్తాడు. అతను ఈ పని కొరకు తన సైకిల్ రిక్షా మీదనే వస్తాడు

అకౌర రోడ్ లో పూజకు ఆఖరిరోజున దుర్గ దేవతను నిమజ్జనం కోసం తీసుకెళ్తున్నారు. ఢాక్ ను వాయించడానికి ఇది ఒక ముఖ్యమైన సందర్భం

కేర్ చౌమొహని ప్రాంతంలో పూజ తరవాత పరిమళ దాస్ హారతి తీసుకుంటున్నాడు. “ఈ ఏడాది(2021)లో వారు నాకు 11,000 రూపాయిలు ఇచ్చారు, ఇది పోయిన ఏడాది కన్నా 500 రూపాయిలు ఎక్కువ. నాకు 58 ఏళ్ళు నడుస్తున్నాయి, ఢాక్ ను నాకు 18, 19 ఏళ్లప్పటినుంచి వాయిస్తున్నాను”

కొందరు ఢాకీలు లక్ష్మి పూజ జరిగిన సాయంత్రం, వారి ఢాక్ లను వాయించుకుంటూ వీధులలోకి వస్తారు. ఇళ్లలో ఉన్న మనుషులు వీధిలో ఉన్న వీరిని విని , ఇంటికి పిలిచి, ఇంటి వద్ద వాయించమంటారు. ఇది ఢాకీలకు సంపాదించుకునే ఆఖరు అవకాశం

ఢాకీలు ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్లి, ఒక్కో ఇంటి ముందు 5-10 నిముషాలు ఆగి అక్కడ వాయించి, ప్రటి ఇంటికి 20-50 రూపాయిలు సంపాదిస్తారు

రాజీవ్ రిషి దాస్ రాత్రి 9 గం తరవాత లక్ష్మి పూజని ముగించి తిరిగి ఇంటికి వెళ్తున్నారు. “నాకు ఇది నిజంగా ఇష్టం లేదు(ఢాక్ ని వాయిస్తూ ఇళ్లకువెళ్లడం). కానీ నా కుటుంబంలో వారు ఇంకాస్త డబ్బులు వస్తాయని వెళ్లామన్నారు”

పూజ కాలం దాటాక, లా మంది ఢాకీలు వారు మామూలుగా చేసే పని తిరిగి మొదలుపెడతారు. దుర్గ చౌమొహని జంక్షన్ వద్ద వారు రిక్షాలు పట్టుకుని పాసెంజర్ల కోసం ఎదురుచూస్తారు
అనువాదం: అపర్ణ తోట