లద్దాఖ్‌లోని సురు లోయ గ్రామాలు వేసవి నెలల్లో జీవనోత్సాహంతో పొంగిపొరలుతుంటాయి. పచ్చని పొలాల గుండా జలజల ప్రవహించే జలపాతాలతో, శిఖరాగ్రాలలో మంచు కప్పిన పర్వతాలు చుట్టుముట్టి ఉన్న ఈ ప్రదేశాలలో అనేక రకాల అడవి పువ్వులు విరివిగా విరబూసి ఉంటాయి. పగటి ఆకాశాన్ని అందమైన నీలిమబ్బు కమ్మివుండగా, ప్రశాంతమైన రాత్రి ఆకాశంలో పాలపుంత మిలమిలలాడుతుంది!
కర్గిల్ జిల్లాలోని ఈ లోయలోని పిల్లలు తమ చుట్టూ ఆవరించి ఉన్న ప్రకృతితో ఒక సంవేదనాత్మకమైన సంబంధాన్ని కలిగివుంటారు. ఈ ఫోటోలు 2021లో తాయ్ సురు గ్రామంలో తీసినవి. ఈ గ్రామంలోని అమ్మాయిలు కొండలవంటి బండరాళ్ళపైకి ఎక్కుతుంటారు, వేసవిలో పూలను, శీతాకాలంలో మంచును సేకరిస్తారు, ప్రవాహాల్లో గెంతులేస్తారు. బార్లీ పొలాల్లో ఆడుకోవడం వేసవికాలంలో వారికెంతో ఇష్టమైన పని.
కర్గిల్ చాలా మారుమూల ప్రాంతం. కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో ఉన్న రెండు జిల్లాలలోని మరో జిల్లా, ప్రముఖ పర్యాటక ప్రదేశం అయిన లేహ్‌కు ఇది చాలా దూరంలో ఉంటుంది.
ఇతర ప్రాంతాలకు చెందిన చాలామంది కర్గిల్, కశ్మీర్ లోయలో ఉందని తికమకపడతారు, కానీ అది ఎంతమాత్రం నిజం కాదు. కశ్మీర్లో సున్నీ ముస్లిమ్‌లు ఎక్కువగా ఉంటారు. కర్గిల్లోని మెజారిటీ ప్రజల మత విశ్వాసం షియా ఇస్లామ్.
సురు లోయలోని షియా ముస్లిమ్‌లు, కర్గిల్ పట్టణానికి దక్షిణంగా 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాయ్ సురును ఒక ముఖ్యమైన మతకేంద్రంగా భావిస్తారు. ఇక్కడి ప్రజలకు, మహమ్మదీయుల నూతన సంవత్సరంలోని మొదటి నెల - ముహర్రం - మొహమ్మద్ ప్రవక్త మనవడు ఇమామ్ హుస్సేన్ కోసం ఆచరించే సంతాప మాసం. అక్టోబరు 10, 680న కర్బలా(ఇప్పటి ఇరాక్) యుద్ధంలో హుస్సేన్, అతని సహచరులు 72 మంది మరణించారు.
ఈ ముహర్రం సందర్భంగా పాటించే ఆచారాలలో పురుషులు, మహిళలు కూడా పాల్గొంటారు. జూలూస్ లేదా దస్తా అని పిలిచే ఊరేగింపులు చాలా రోజులపాటు జరుగుతాయి. వీటిలో అతిపెద్దదైన ఆశూరా మొహర్రం పదవ రోజున జరుగుతుంది. ఇది హుస్సేన్, అతని పరివారం కర్బలాలో అమరవీరులైన రోజు. కొంతమంది పురుషులు గొలుసులు, బ్లేడ్లతో తమని తాము శిక్షించుకునే ( కా మా ౙాని ) ఆచారాన్ని పాటిస్తారు. ప్రతి ఒక్కరూ తమ ఛాతీపై కొట్టుకుంటారు ( సీనా ౙాని ).

సురు లోయలోని కర్గిల్ పట్టణానికి దక్షిణంగా 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాయ్ సురు గ్రామంలో దాదాపు 600 మంది నివసిస్తున్నారు. ఇది కర్గిల్ జిల్లా తైఫ్సురు తహసీల్‌కు ప్రధాన కార్యాలయంగా పనిచేస్తోంది
ఆశూరా కు ముందు రోజు రాత్రి, మహిళలు మసీదు నుంచి ఇమామ్ బా రా (సమావేశ మందిరం) వరకు ఊరేగింపుగా వెళతారు. వెళ్ళే దారిపొడవునా మర్సియా , నోహాల ను (విలాపాలు, శోకగీతాలు) జపిస్తూ వెళతారు. ( ఆశూరా ఈ సంవత్సరం ఆగస్టు 8-9 తేదీలలో వస్తుంది.)
హుస్సేన్, అతని సహచరులు చేసిన ప్రతిఘటననూ, త్యాగాన్నీ గుర్తుచేసుకోవడానికి ప్రతి ఒక్కరూ ముహర్రం సందర్భంగా ఇమామ్ బా రా లో రోజుకు రెండుసార్లు మజ్లిస్ (మతపరమైన సమావేశం) కోసం సమావేశమవుతారు. హాలులో వేర్వేరు ప్రదేశాల్లో కూర్చొని, పురుషులు (బాలురు కూడా), మహిళలు కర్బలా యుద్ధం, సంబంధిత సంఘటనల గురించి ఆఘా (మతాధిపతి) చెప్పే కథనాలను వింటారు.
అయితే, ఆ హాలుకు పైన ఉన్న అంతస్తులో అమ్మాయిలు కూర్చునేందుకు మధ్య మధ్య రంధ్రాలున్న బాల్కనీ ఉంది. ఈ ప్రదేశం నుంచి వారికి దిగువన జరిగేదంతా కనిపిస్తుంది. దీనిని ' పింజ్రా ' లేదా పంజరం అని పిలుస్తారు. ఈ పదం నిర్బంధాన్ని, ఊపిరాడనితనాన్ని గుర్తుకు తెస్తుంది. అయితే, ఈ ప్రదేశం మాత్రం అమ్మాయిలు స్వేచ్ఛగా ఉండేలా, వారికి ఆటలాడుకునే వీలుని కూడా కలిగిస్తుంది.
ఇమామ్ బారా లోని శోకతరంగం తారాస్థాయికి చేరిన తరుణంలో, అమ్మాయిల హృదయాలు ఒక్కసారిగా దుఃఖంతో నిండిపోయి, వారు కూడా తల వంచుకుని ఏడవడం ప్రారంభిస్తారు. కానీ వారి ఏడుపు ఎంతోసేపు నిలబడదు.
ముహర్రం శోక మాసం అయినప్పటికీ, పిల్లల ప్రపంచంలో మాత్రం అది తమ స్నేహితులను కలుసుకోవడానికీ, గంటల తరబడి, అర్ధరాత్రి వరకూ కూడా, వారితో కలిసి గడిపేందుకూ వారికి అవకాశం కలిగిస్తుంది. కొంతమంది అబ్బాయిలు తమను తాము కొరడాలతో కొట్టుకుంటారు, కానీ ఆ ఆచారం అమ్మాయిలకు నిషేధం. అమ్మాయిలు సాధారణంగా మిగిలినవాళ్ళు ఇదంతా చేస్తుండటాన్ని చూస్తుంటారంతే.
సాధారణంగా ముహర్రం గురించి ఆలోచించినప్పుడు, చిరిగిన బట్టలు, ముస్లిం యువకులు వీపుపై రక్తం వచ్చేలా కొట్టుకోవడం వంటివి మాత్రమే మన దృష్టికి వస్తాయి. కానీ దుఃఖాన్ని వ్యక్తం చేయటానికి ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. సరళత, శోకంతో నిండి ఉండే స్త్రీల తీరు దీనికి మంచి ఉదాహరణ.

బార్లీ పొలాలలో ఆడుకుంటోన్న జన్నత్ . వేసవి కాలంలో ఇలా ఆడుకోవటం తాయ్ సురులోని పిల్లలకు అమిత ఇష్టమైన కార్యకలాపం

వేసవికాలంలో పంట పొలాల్లో పెరిగే అడవి పూల పానుపుపై కూర్చున్న జన్నత్ ( ఎడమ ), అర్చా ఫాతిమా

ఉదయపు వేళలను బడిలో , సాయంత్రం వేళలను ఆటల్లో . హోంవర్క్ చేయటంలో గడుపుతుంటారు పిల్లలు . వారాంతాల్లో , విహారయాత్రలు ఉండవచ్చు . విహారయాత్రలో ఒక జలప్రవాహంలో ఆడుకుంటోన్న మొహదిస్సా (11)

లద్దాఖ్‌లోని సురూ లోయలో ఉన్న తాయ్ సురు గ్రామంలో ఎత్తైన బండరాతిని ఎక్కుతోన్న ఇద్దరు బాలికలు. ఈ లోయలోని పిల్లలు తమ చుట్టూ ఉన్న ప్రకృతితో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకుంటారు

ఆగస్ట్ 2021 ముహర్రం సమయంలో , తన ఇంట్లో జహ్రా బతూల్ (11) తో కలిసి చదువుకుంటోన్న హాజిరా (10). చదువు పూర్తయ్యాక ఇద్దరూ కలిసి ఇమామ్ బారాకి వెళతారు

ఆగస్టు 16, 2021 న గ్రామంలోని ఇమామ్ బారా వద్ద సీనా ౙాని ( ఆచారం ప్రకారం ఛాతీని కొట్టుకోవడం ) చేస్తున్న పురుషులు . స్త్రీ , పురుషుల కోసం హాలును రెండు వేరువేరు భాగాలుగా విభజించిన నల్లటి గుడ్డతెర

పై అంతస్తులో ఉన్న పింజ్రా బాల్కనీ నుంచి హాల్ లోకి చూస్తున్న అమ్మాయిలు . హాల్ లోని ఆచారాలకు దూరంగా , ఈ ప్రదేశం వారికి స్వేచ్ఛనూ , ఆటలకు స్థలాన్నీ ఇస్తుంది

ఆగస్ట్ 2021 లో ఒక రాత్రి ముహర్రం సమావేశం సమయంలో పింజ్రాలో గడుపుతున్న స్నేహితులు

కలిసి బుడగలు ఊదుతున్న స్నేహితులు

వీడియో
గేమ్
ఆడటంలో
మునిగివున్న
12
ఏళ్ళు
, 10
ఏళ్ల
వయస్సు
గల
ఇద్దరు
బాలికలు
.
గ్రామంలోని
కొన్ని
ప్రాంతాల్లో
మాత్రమే
ఇంటర్నెట్
అందుబాటులో
ఉన్నప్పటికీ
,
ఇతర
ప్రదేశాలకు
చెందిన
పిల్లలలాగానే
,
తాయ్
సురు
పిల్లలు
కూడా
టీవీ
,
సోషల్
మీడియాను
చూస్తూ
గడుపుతారు

ఇమామ్ బారా గోడలను ఎక్కుతూ ; పట్టుబడితే తిట్లు తప్పవు

ఒక ఇమామ్ బారా వెలుపల దాగుడుమూతలు ఆడుతూ విజయ సంకేతం చూపుతోన్న అమ్మాయి

ఆశూరా రాత్రి , పురుషుల నుండి వేరుగా ఊరేగింపు చేపట్టిన తర్వాత మహిళలు నోహా పాడడాన్ని చూస్తోన్న పిల్లలు . కర్బలా యుద్ధంలో ఇమామ్ హుస్సేన్ మరణించినందుకు సంతాపంగా ఇస్లామిక్ నెల ముహర్రం పదవ రోజున ఈ ఆచారం జరుగుతుంది

ఆగష్టు 19, 2021 నాటి ఆశూరా రోజున ప్రాంతీ గ్రామం నుండి తాయ్ సురు వైపుకు సాగుతోన్న మహిళల ఊరేగింపు

ఆగస్టు 2021 లో ఆశూరా రోజున సాగుతోన్న పురుషుల ఊరేగింపు

పురుషుల ఊరేగింపును అందుకోవడానికి ప్రయత్నిస్తోన్న బాలికలు

తాయ్ సురులో ఆశూరా సందర్భంగా మర్సియా పఠిస్తూ , సీనా ౙానీ ( శోకంతో ఛాతీని కొట్టుకోవడం ) చేస్తున్న కొంతమంది అమ్మాయిలు

ఇమామ్ హుస్సేన్ సోదరి జైనాబ్ పల్లకీలో కూర్చొని కర్బలాకు వెళ్లడాన్ని సూచించే ౙంపన్ ( పల్లకి ) తో ఆశూరా ముగుస్తుంది . గ్రామంలోని బహిరంగ మైదానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు . ఉమయ్యద్ ఖలీఫా యజీద్ పాలనను వ్యతిరేకించినందుకు ఇమామ్ హుస్సేన్ నూ , అతని సహచరులనూ ఉరితీసిన కత్ల్ - ఎ - గాహ్ ను ఈ మైదానం సూచిస్తుంది

కత్ల్ - ఎ - గాహ్ వద్ద ప్రార్థనలు చేస్తున్న బాలికలు

ఆశూరా రోజున కత్ల్ - ఎ - గాహ్ వద్ద ప్రదర్శించే కర్బలా యుద్ధాన్ని చూసేందుకు గ్రామం మొత్తం ఒకచోటికి చేరుతుంది

ఆగస్ట్ 2021 లో ఆశూరా అయిన రెండు రోజుల తర్వాత తాయ్ సురులో జరిగిన ( జులూస్) ఊరేగింపు

ఆశూరా తర్వాత రెండు రోజులకు ఇమామ్ హుస్సేన్ తాబూత్ ( శవపేటిక చిహ్నం ) ను తీసుకువెళుతున్న తాయ్ సూరు గ్రామ మహిళలు

సెప్టెంబర్ 2021 లో ఒక జులూస్ తర్వాత మూకుమ్మడిగా ప్రార్థనలు చేస్తున్న తాయ్ సురు గ్రామస్తులు . కర్బలా అమరవీరులకు తెలిపే సంతాపం ముహర్రం ముగిసిన ఒక నెల తర్వాత వచ్చే సఫర్ వరకూ కొనసాగుతుంది
అనువాదం: సుధామయి సత్తెనపల్లి